ఇంతవరకూ వెలువడిన సతీష్ చందర్ గ్రంథాలలో (మొత్తం 14) కేవలం వ్యంగ్యానికి సంబంధించినవి అయిదు; మేడిన్ ఇండియా (1992), ఇతిహాసం (1995), దరువు (2002), వాలూచూపులూ, మూతి విరుపులు (2005), చంద్రహాసం (2006).
ఇప్పుడు మీరు చదువుతున్న కింగ్‌మేకర్ ఆరవ పుస్తకం. ఆంధ్రప్రభ దినపత్రికలో 2003లో ప్రతి సోమవారం 'కింగ్‌మేకర్' శీర్షిక కింద ఆయన వ్యంగ్య రచనలు వెలువడుతుండేవి. అప్పటికాయన ఆ పత్రికలో సంపాదకులుగా పనిచేస్తున్నారు. ఆ రచనల సంకలనమే ఈ గ్రంథం.
రచనా కాలం విచిత్రమైనది. 'ఫీల్ గుడ్' అని దేశానికి భరోసా ఇచ్చిన వాజ్‌పేయీ పాలనకూ, 'నిద్రపోను, నిద్రపోనివ్వను' అని రాష్ట్రానికి కాపలా కాస్తున్న చంద్రబాబు సర్కారుకు ఏడాదిలోగా 'శుభంకార్డు' పడబోతుందని తెలియదు. క్లయిమాక్స్‌లో కవ్వింపుల్లా ఈ రచనలు వచ్చాయి.
* * *
సతీష్ చందర్ వ్యంగ్య రచయిత, కవి, సంపాదకులు, కథకులు. కవిత్వంలో ఒక బలమైన వాదానికి ప్రతినిధిగా నిలిచారు. ఆయన కవిత్వం పలు విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశంగా వుంది. పత్రికా సంపాదకుడిగా నేడు రాష్ట్రంలో వున్న రెండు ప్రముఖ దినపత్రికలకు జీవం పోశారు. ఆయన రాసిన సంపాదకీయాలు పాఠకుల విశేష ఆదరణకు నోచుకున్నాయి. ఆయన రాస్తున్న కథలు గత రెండు దశాబ్దాలుగా అత్యుత్తమ కథల సంకలనాల్లో స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. వ్యంగ్య రచయితగా ఆయనకున్న ముద్ర ప్రత్యేకమైనది. వ్యంగ్యంలో తెలుగువారి 'ఆర్ట్ బుచ్‌వాల్డ్'గా పేరు తెచ్చుకున్నారు.