“బ్రహ్మానందం” – సాధువులకో, పుణీతులకో, లేక బ్రహ్మైక్యం పొందినవారికో.
కాని మరి సామాన్యులకి ఆ వాసన ఒక రవంత రుచి చూపించాలి అనుకున్నాడేమో బ్రహ్మ,
రాత రాసి మరీ పంపినట్టు ఉన్నాడు “బ్రహ్మానందం” గారిని…
సార్దక నామదేయుడు, హాస్యరసకోవిదుడు…
కళతోరణంలో హాస్యరసాన్ని పండించి, సినిమా చరిత్రలో హాస్య నటనకు వన్నె తెచ్చి…
అత్యున్నత శిఖరాన్ని అధిరోహించినా కూడా ఆయన
“అంతా ఆ శ్రీహరి కృపా కటాక్షమే” అని అనడం —
ఆయనలోని వినయానికి, విద్వత్తుకు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూక్తికి తార్కాణం.
అసలు ఈ పుస్తకం చదవటానికి కారణం కూడా అదే!
ఏంటి ఈ మనిషి అంత ఎత్తుకు ఎదిగీ కూడా
“ఆ నారాయణుడి శరణాగతి వల్లనే” అంటాడు? అని - కాని చదివాక అవగతం అయింది — సంకల్పం గొప్పది అయితే, ఏనాటికైనా శ్రీనివాసుడు సహకరిస్తాడు అని —
కొందరికి ఈ జన్మలోనో, మరికొందరికి ఏ జన్మలలోనో —
అయితే హాస్యానికో, విజయదర్పానికో కాక
ఒక చక్కటి భక్తి పరవశ్యం ఈ పుస్తకంలోనే కాదు,
ఆయన నటన ప్రదర్శనలో (అంటే పాత్రని భక్తితో శ్రద్ధగా చేస్తాడు కాబట్టి) ప్రస్ఫుటంగా దర్శిస్తుంది. అందుకేనేమో సర్వేశ్వరుడు సర్వుల హృదయాలలో బ్రహ్మానందాన్ని వెదచల్లమని నిర్దేశించినట్టు ఉన్నాడు.
ఏదో పుస్తకం కదా అని గంభీరమైన పదబంధాలతో, ఛందోబద్ధ అలంకారాలతో, ఉపన్యాసాలతో ఉంటుందని అనుకునేరు — కాదండోయ్!
సినిమా పక్కీలో అయిన వేసి చలోక్తులతో,
సరదా మాటలతో శ్రావ్యంగా, హాస్యంతో భావ్యంగా ఉంటుంది…
ఈ సండే ఈ మహానుభావుడు తన రచనతో
సమయాన్ని మైమరపించాడు —
అదేంటో రచన కూడా హాస్యంలాగే నవ్వించింది చలోక్తులతో. తెలుగు మాస్టారు కదా మరి…
పాండిత్యం కూడా అంతే స్థాయిలో ప్రకాశిస్తుంది.