"ముక్కు మూసుకుని 'సోఽహం... సోఽహం' అంటూ జపిస్తూ కూర్చోవడాన్ని ప్రోత్సహించడం సాయి సిద్ధాంతం కాదు. 'సాధకుడా! లే! నడుం కట్టు! సమాజసేవలో ప్రవేశించు!' అని హెచ్చరించడమే సాయి సిద్ధాంతం" అని ఉద్బోధించారు, భగవాన్. ఆధ్యాత్మిక, సామాజిక, వైయక్తిక పరిణామములను తీసికొనిరావడమే సాయి అవతార దివ్య లక్ష్యమని ప్రకటిస్తూ, ఈ లక్ష్య సాధనకై ప్రపంచవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవాసంస్థలను ఏర్పాటు చేసి, పలు బృహత్సేవా పథకాలను తాము స్వయంగా చేపట్టి నిర్వహిస్తూ మానవాళిలో స్ఫూర్తిని నింపారు. లక్షలాది సాయి భక్తులను సుశిక్షితులైన సేవాయోధులుగా తీర్చిదిద్ది సమాజసేవలో ప్రవేశపెట్టా”రు. 'జన సేవ బినా సుఖ శాంతి నహీ' అని ఎలుగెత్తి చాటుతూ సేవకు గల ప్రాధాన్యతను స్పష్టం చేశారు. 1968వ సం|| మొదలు 2000 సం|| వరకు అఖిల భారత మరియు అంతర్జాతీయ స్థాయులలో జరిగిన శ్రీ సత్యసాయి సేవాసంస్థల మహా సమ్మేళనములను పురస్కరించుకొని ఆయా సందర్భాలలో భగవాన్ అనుగ్రహించిన దివ్యోపదేశములను సంకలనం చేసి, "దివ్య సారథ్యంలో శ్రీ సత్యసాయి సేవాసంస్థలు" ఐదు సంపుటాలుగా సంకలనం చేసి, భగవాన్ 90వ జన్మదినోత్సవ సమర్పణగా వెలువరించడం జరిగింది.