నేను రాసిన ఈ “నా స్పందన” అనే కవితా సమూహం నా మనసును ఊలలాడించిన భావాలను “ఆర్యన్” అనే నా కలం పేరిట వ్రాసి నేను పదిలం చేసుకున్న అక్షరాలు. నన్ను వేదనకు గురిచేసిన సమాజంలోని కొన్ని విషయాలు, నేను గర్వించే మన దేశ చరిత్ర, మానవీయ బంధాలు, కోపాలు, మరొకరి జీవితంలో నిల్చుని చూస్తూ వారి బాధను నేను అనుభవించిన క్షణాలు, వాటి ఆనవాళ్లు. పసి వయస్సులో నాకు నేను చెప్పుకున్న సమాధానాలు, నేనెరిగిన నా దేశం, యవ్వనంలో ప్రేమ, చెదిరిన కలలు, వాటిపై నిర్మించుకున్న ప్రపంచం, ఊహలు, కాల్పనికమైన ప్రేమాలోకం, ఆ లోకంలో జరిగే వింతలు. ఇలా ఎన్నో కనపడుతాయి. ఈ నా భావాలు ఎంతమందిని పరవశింపజేస్తాయో, ఎంతమందిని మురిపిస్తాయో, మరిపిస్తాయో, ఎందరి మోమున ఒక చిన్ని చిరునవ్వును చూస్తాయో, నేనెరుగను.