పరవశం(స్పందన-7) శీర్షిక: (మన సుందరుడు వ్రాస్తే)కిం న సుందరం? Gifted - Gained?
వేటూరి వారి పెన్ని(కలం/పాళీ ఇ)ది, కాబట్టి సాహితీపెన్నిధి అనుకుని ఈ పుస్తకం- కాదు కాదు, కావ్యం చదవబోతే పొరబడినట్టే. ఇది సంగీతనిధి. ఇదెలా ఉందని అడగడం భావదారిద్ర్యం. ఇదిలా ఉందని చెప్పాలనుకోడం ఙ్ఞానరాహిత్యం. ప్రతీ వాక్యమూ సాహిత్యం, రసభూయిష్టం. ఇది ఉపాసనాఆవాహనలతోబాటు నిరుటిజన్మలో తన ప్రబంధంవాఙ్మయతత్త్వము, ఆ వాసనలూ కలుపుకుని, తెలుగుగేయం కోసమే పుట్టిన పాటసారి మనస్సు.
సాహితీగోష్టికి ధోవతిలాల్చీలో సాంతం కూర్చుని వెళ్ళొచ్చినట్టు, మహాసభల్లో కవిపుంగవుల, పండితుల సుదీర్ఘ ఉపన్యాసం విని వచ్చినట్టు, శతావధానం తిలకించినట్టు, కళాశాలలో మెదడును మెలిపెట్టివదిలిన ఆచార్యుల బోధన ఆలకించినట్టు, ప్రాథమికోన్నత పాఠశాలలో తెనుగుపండితుడి తరగతిలో ఉన్నట్టు, ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు హంసపంచకంబు ఆటవెలది అని పద్యలక్షణాలు వల్లెవేసినట్టు, అసలు ఓనమాలే మళ్ళీ దిద్దుకున్నట్టు, మూలాల్లోకి వెళ్ళిపోయాను.
సిరివెన్నెలగారు, వేటూరిగారెదురైనప్పుడు బృందావనంలో గోపాలుడు గోపికలు ఎలా అగుపించాడో మీరు నాకలానే అవుపిస్తున్నురాని తెలుసుకున్నపుడు, అలా ఎందుకన్నారు అనే ప్రశ్నకు, "ఆ తెలిసెన్" అనిపించగల జవాబు ఈ చిన్నికావ్యం.