Jump to ratings and reviews
Rate this book

అనుక్షణికం

Rate this book

845 pages, Hardcover

First published January 1, 1981

3 people are currently reading
57 people want to read

About the author

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
2 (28%)
4 stars
3 (42%)
3 stars
1 (14%)
2 stars
0 (0%)
1 star
1 (14%)
Displaying 1 - 2 of 2 reviews
Profile Image for Sunitha Ratnakaram.
9 reviews8 followers
January 28, 2020
అనుక్షణికం - వడ్డెర చండీదాస్

సుమారు తొమ్మిది వందల పేజీల పుస్తకం. నూట ముప్పై నాలుగు చాప్టర్లు. కనీసం వంద పేజీల వరకూ ముఖ్య పాత్రల పరిచయాలు. తక్కువలో తక్కువ యాభై దాకా గుర్తుంచుకోవలసిన పాత్రలు. ప్రతి పాత్ర సమగ్రమైన పరిచయం. రూపురేఖావిలాసాల (ముఖ్యంగా స్త్రీ పాత్రలు) నుంచి వారి హావభావాలు, వ్యక్తిత్వం వరకూ. ఒక పాత్ర గురించి రాస్తూనే ఆ పాత్ర నుంచి ఇంకో పాత్రకు ప్రయాణం. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ పద్ధతిలో రాసిన నవల చాలా భాగాలలో. పదేళ్ల సామజిక, రాజకీయ, విప్లవ భావజాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన కథ. ఇన్ని పాత్రల్ని అతి తక్కువ వ్యవధిలో పరిచయం చేస్తూ రావడం వల్ల ఒక పది చాప్టర్లు చదివేకల్లా పాఠకుడు గందరగోళంలో పడిపోయి ఇంక ఆ పుస్తకాన్ని పక్కనపెట్టే ప్రమాదం ఎంతైనా వుంది. బహుశా నేను ఈ పుస్తకం చదవవలసిందే అన్న పట్టుదలతో మొదలుపెట్టడం మూలానా ఆ మొదటి ప్రతిబంధకాన్ని దాటగాలిగాను. ఒక పదిహేను ఇరవై చాప్టర్లు కష్టపడితే అప్పటికి ముఖ్య పాత్రలు కాస్త కుదురుకుని కథ నడవడం మొదలెట్టి పాఠకునికి కొంత ఆసక్తి కలుగుతుంది. కానీ, అందరు రచయితల్ని చదవడానికి అందరు పాఠకులూ ఇంత కష్టపడడానికి సిద్దంగా వుండకపోవచ్చు. కాబట్టి, కనీసం కొత్త రచయితలకూ ఈ పద్దతి ఎంత మాత్రం మార్గదర్శకం కాదు.

ఇంకొక గమనింపు, అనుక్షణికం చదివేక ఓ నవలను సీరియల్గా రాసే రచయితల పరిమితులు నాకు కొంచెం అర్థం అయినట్లే ఉంది. ప్రతి వారం కొంత కథ చెప్పాలి, కావలసిన గుర్తులు చెప్పాలి పాత కథ నుంచి. కొత్త పాత్రలు పరిచయం చేయాలి, కొన్ని మలుపులు తిప్పాలి, కీలకంలో ఆపేయాలి. వీలైతే కొంత అప్పటి సమాచారం కలపాలి. వెరసి ఇప్పుడు నవలగా చదువుతున్న పాఠకులకి చాలా ఎక్కువ అనవసర సమాచారం కనపడటం. రచయితలు తమకు తెలిసిన సమచారం అంతా దట్టించి రాస్తున్నారని కొంచెం చిరాకుగా వుండేది. ఇప్పుడు అట్లా సీరియలైజ్ అయి నవలలుగా మారిన కథల్ని ఇంకాస్త సహనంతో చదువుకోగలను.

అనుక్షణికం చదువుతున్నంతసేపూ చండీదాస్ కు వున్న బహుముఖీనమైన ప్రజ్ఞ గురించి ఆశ్చర్యపడకుండా ఉండలేము. కానీ రచయిత ప్రజ్ఞా ప్రదర్శనతోనే గొప్ప నవల సృష్టించవచ్చా అంటే అంత తేలిక సమాధానం ఇవ్వలేము. ఆ కథకు అవసరమైన పరిజ్ఞాన ప్రదర్శన మాత్రం చేస్తే కథలో ఇమిడిపోతుంది, లేనప్పుడు ఆ ఎక్కువలంతా బయటకు వచ్చి సరైన ఆకృతిలో కథ కనిపించదు. అనవసరమైనది అంతా నిర్దాక్షిణ్యంగా చెక్కివేయడమే శిల్పం అని నేను చదివిన అతి సులువైన నిర్వచనం ఉత్త శిల్పానికి సంబంధించి. చదివించే గుణం ఉండీ, పాఠకుని మనస్సులో చెరగని ముద్ర వేసిన కథ - మంచి శిల్పం ఉన్న కథే! అని విష్ణుభొట్ల లక్ష్మన్న గారు తేల్చేసారు. ఆ లెక్కలో కనక చూస్తే కొన్నిచోట్ల అనవసరాలు వున్నా, చదివించే గుణంలో కొంత కొరవ వున్నా కథగా అనుక్షణికం మంచికి కాస్త తక్కువలో ఆగుతుంది. సరే, ఇది నా అవగాహన కోసం రాసుకున్న పేరానే కాబట్టి మీరు సేరియస్గా తీసుకోనక్కరలేదు.

ఇంక కథ విషయానికి వస్తే డెబ్బైల కాలపు సుమారు ఒక పదిహేను, ఇరవై మంది ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కళాశాల విద్యార్థుల జీవితాల్లో పదేళ్ళ కాలంలో జరిగిన ఉత్థానపతనాల సంగ్రహమే ఈ కథ. నాయకుడు, నాయిక అని ఇద్దరిని చూపలేము కానీ, శ్రీపతి, స్వప్న రాగలీన ప్రస్ఫుటంగా మిగిలిన వారికంటే ఎత్తులో నిలబెట్టబడి కనిపిస్తారు నవల మొత్తం. చండీదాస్ వాచ్యంగా చెప్పకపోయినా ఈ పాత్రలు ఆయన అభిమాన పాత్రలు అని పాఠకుడికి తెలిసిపోతాయి. స్వప్న రాగలీన ను వొక ఎత్తైన దైవీ పీఠం మీదనే కూర్చోబెడతారు అయన స్పష్టంగా. శ్రీపతి చండీదాస్ కి కథలోని గొంతు, ఆయన ఎక్స్టెండెడ్ వాయిస్. ఒక విధంగా చెప్పాలంటే కథకుడికి కథను మించి చెప్పాలనుకున్న ప్రతీ మాటకి మైక్ శ్రీపతి. శ్రీవతి కూడా ఒక ఊర్థ్వ ప్లేన్ లోనే ఉంటాడు. కథలోని మంచి పాత్రలూ, చెడ్డ పాత్రలూ అందరూ మూకుమ్మడిగా శ్రీపతిని గౌరవిస్తారు. శ్రీపతి చదవని చదువు లేదు, తనకి తెలియని విషయం లేదు, ఇష్టపడని మనుషులు దాదాపుగా లేరు. జమిందారీ వారసుడు, జమీల మీద ఆసక్తి లేదు. మంచితనం నిండుగా వున్న మనిషి. అవసరంలో వున్న వాళ్ళని ఆదుకునేందుకే ప్రయత్నం చేస్తుంటాడు. మిగిలిన వాళ్ళ కన్నా కొంత ఎక్కువ నయం అమ్మాయిలని సభ్యంగా చూసే విషయంలో. ఈ విషయంలో మోహన్ రెడ్డి ఉత్తమంగా కనపడతాడు. ఒక పీజీ తర్వాత ఇంకొకటి చదువుతూ కథాకాలం పదేళ్ళూ దరిదాపుగా యూనివర్సిటీలోనే ఉంటాడు. కథా ప్రారంభం ముగింపూ ఇతనితోనే.

మోహన్ రెడ్డి, గాయత్రి కథలోని ప్రముఖమైన విప్లవ స్వరాలు. విరసం సభ్యులు. గాయత్రి కి మెహర్బానీ విప్లవం అంటే చీదర. మోహన్ రెడ్డి అందరినీ ఓపికగా కలుపుకుపోవాలనే తత్త్వం వున్న మనిషి. ఇద్దరూ లా చదువుతారు. గాయత్రి చట్టాన్ని అడ్డుపెట్టి న్యాయానికి న్యాయం చెయ్యలేమని గ్రహించి చదువు పూర్తి చేయదు. మోహన్ రెడ్డి ప్లీడర్ గా అణగారిన వాళ్ళకి సహాయం చేస్తున్న క్రమంలో తనూ తెలుసుకుంటాడు. కథ మధ్యలో పెద్దలు కాదన్నాక సహజీవనం మొదలుపెడతారు, వారి జీవితం అనేక మలుపులు తిరిగి చివరికి అడివిని చేరుతారు ఇద్దరూ.

స్వప్న రాగలీన ను పరిచయం చేసిన దగ్గర్నుంచి ఆవిడ చుట్టూ వున్న అందరూ తన మాగ్నెటిక్ ఫీల్డ్ ప్రభావంలో పడ్డట్టుగానే చూపిస్తారు చండీదాస్. ఈ పాత్ర ఆయన స్వప్న సుందరి బహుశా, నిస్సందేహంగా అధిలోకపు జీవి. స్వప్న రాగలీనని వర్ణించడానికి చండీదాస్ వాడుకున్న ఉపమానాల దగ్గరనుంచి మొత్తం ఆవిడ శారీరక లక్షణాలు, గుణగణాల వర్ణన దాకా అన్నీ భౌతికతకు పై స్థాయిలోనే వుంటాయి. ఆవిడ ప్రేమించిన అనంత రెడ్డి చదువులోనూ, తన కళ లోనూ జీనియస్; రూపంలో స్వప్నకు తగినవాడు. పెద్ద అడ్డంకులుఏవీ లేకుండా కొంత కాలపు అవసరమైన ఎడబాటు మాత్రమే అనంత్ రెడ్డి చదువు రూపేణా అడ్డంకిగా వుండి కలిసిన ఒకే ఒక ముఖ్యమైన జంట వీళ్ళది. కానీ, స్వప్న ఈ లోకపు జీవి కాదని చండీదాస్ తీర్మానం కావున తను ఈ లోకానికి చెందదు. అచ్చంగా ప్రేమించిన అనంత్ రెడ్డి స్వప్నను కోల్పోయి మతిలేని లోకానికి చేరతాడు.

నిజాం కాలేజీలో చదివే రవి తన ఇష్టాన్ని లెక్కచెయ్యకుండా కూతురితో వివాహం నిర్ణయించిన మామను ఎదిరించి ఆయన డబ్బుతో ఇంక చదవడం ఇష్టంలేక చదువు మానేసి ఒక కార్మికుడిగా జీవితం మొదలుపెట్టి రాష్ట్ర మంత్రిగా ఎదిగేదాక ప్రయాణిస్తాడు. ఎన్నో మెట్లు ఎక్కుతాడు, అంతకు మించిన లోయల్లోకి జారిపోతాడు. గంగి తనకు నాణ్యంగా మొదలైన తోడు. రవిని మించిన అగాథాల్లోకి రవి కంటే ముందే ప్రయాణించి తనతో పాటు లాక్కువెళుతుంది. రవిని ప్రేమించిన నళిని దొరికిన అంకినీడు తో సర్దుకుని అతనిలోని దౌర్బల్యాలన్నింటినీ సమూలంగా నరికి పారేస్తుంది ఏమాత్రం కారుణ్యం చూపకుండా, తనకు కావలసిన మనిషిగా తయారయ్యే దాకా.

తార ప్రస్థానం వస్తు వ్యామోహంతో, పై స్థాయి సమాజపు గుర్తింపు కాంక్షతో తనతో పాటు భర్తను కూడా కిందికి లాగుతూ నీచంగా చూడబడే పాత్రగా మొదలయ్యి చివరికి తనని చూసి లోకం జాలిపడవలసిన స్థితిలోకి చేరి జీవితాన్ని అంతం చేసుకుంటుంది. రామ్మూర్తి కథాగమనం మొత్తం కనపడుతున్నా ఎంతమాత్రం ప్రభావశీలమైన పాత్ర కాదు. అన్నాచెల్లెళ్ళు వరాహ శాస్త్రి, చారుమతి పెద్దగా చెదరని ప్రశాంత జీవులు కథ మొత్తంలో. విజయకుమార్ పరమ దౌర్భాగ్యపు ప్రవర్తనతో మొదటి భార్య చావుకు కారణమై, కాస్త గట్టిగా నిలబడ్డ రెండవ భార్య చేతిలో పూర్తిగా వంగుతాడు. ఇట్లా చెప్పుకుంటూ పొతే ఎన్ని పాత్రలో. దానికన్నా ముఖ్యం ఆలోచనలు కదా!!

ఈ పుస్తకం మీద వున్న ప్రధాన విమర్శ స్త్రీ పురుష సంబంధాల్లోని లైంగికత గురించి విపరీతమైన ప్రాసంగికత. లైంగిక సంబంధా���ను గురించి పుస్తకంలో రాయడం తప్పు కాకపోవచ్చు, కానీ కథకు ఎంత అవసరం అన్న అదుపు రచయిత నిర్ణయించుకోవలసినదే. చండీదాస్ తను ఇచ్చిన పాఠకుల ప్రశ్నలకు సమాధానాల్లో తనని తాను ఎంతయినా సమర్థించుకుని వుండవచ్చు గాక, నాకు మాత్రం ఆయనతో ఏకీభావం లేదు ఈ విషయంలో. మళ్ళీ భాష విషయంలో నేను రచయితని నెత్తిన పెట్టుకోగలను. అనుక్షణికంలో ఆయన అన్ని మాండలికాలకు చోటు కల్పించారు. రాసిన అన్ని యాసల మీదా ఆయనకు మంచి పట్టు వుంది. మళ్ళీ ఇందులో చెడ్డ పాత్రలు వ్యావహారిక తెలుగు మాట్లాడకపోవడం కొంచెం ఆలోచనలో పడవేసే విషయమే  చెడ్డ పాత్రలన్నీ గుండు గుత్తగా ఒక ప్రాంతపు యాసనే వాడతాయి. మంచి పాత్రలు దాదాపుగా ఒక ప్రాంతం నుంచే వచ్చాయి. ఏదేమైనా అసలంటూ రకరకాల యాసల్ని రాయటం మంచి విషయమే.

వీటికి మించి నాకు ప్రధాన సమస్య గా కనిపించిన విషయం విపరీతమైన ఆబ్జేక్టిఫికేషన్ ఆఫ్ వుమన్. ఆడవాళ్ళ పాత్రలని అతి ఎక్కువగా రక్త మాంసాల్లోనే దర్శించారు రచయిత. ముఖాలని అసలు చూడబుద్ది కాదు ఆయనకు మిగిలిన అవయవాలే కాని. స్వప్న రాగలీన ని తప్ప మిగిలిన వాళ్ళని వర్ణించాలంటే చూడబుద్ది కాని రూపం, ముక్కు తెచ్చిపెట్టినట్టున్న రూపం, రంగు పాలిపోయిన రూపం, లావణ్యం అస్సలు లేని ముఖం, చెక్కేసిన ముఖం. మగవాళ్ళ పాత్రలను మరి ఇట్లా కొలతలతో పరిచయం చెయ్యలేదు వాళ్ళకు హావభావాలు మాత్రం చాలు. ఇంకొక విషయం చక్కనివాళ్ళు మంచివాళ్ళే ఎక్కువసార్లు. రచయిత ఇంకెవరైనా అయ్యుంటే బహుశా నాకు ఈ పేరా రాయడం ముఖ్యమయ్యేది కాదు. చండీదాస్ హిమజ్వాలలో గీతా దేవిని అత్యంత మహత్తరమైన పాత్రగా తీర్చి దిద్దరాని చదివిన అందరూ చెప్పాక ఆయన నుంచి ఇటువంటి పలుచదనం స్త్రీ పాత్రలకు ఆపాదించబడుతుందని ఎదురుచూడలేదు. స్వప్న రాగలీన ను కొలతగా ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్న రావచ్చు, ఆవిడని అధిమానవ పాత్రగా సృష్టించడం వల్ల. ఆమె రక్త మాంసాలున్న మనిషి కాకపోవడం వల్ల. ఈ నవలలోని స్త్రీ పాత్రలన్నింటిలో కాస్త గట్టి ఆలోచన ఉన్న పాత్ర గాయత్రిదే. ఆ గాయత్రి ఆలోచనలు కూడా ఎక్కువసార్లు వితండవాదంలా కనిపించడం కూడా ఆశ్చర్యమే. దాంతో చాలా బలంగా ఉండవలసిన పాత్ర చాలాసార్లు కేరికేచర్ లాగ కనపడుతుంది. విరసంలో వున్న తన మేల్ కౌంటర్పార్ట్శ్ అట్లా వుండరు, వాళ్ళకు అందరికీ పట్టు విడుపులు తెలుసు. సరే, ఆడవాళ్ళలో ఒక్క వేశ్యావృత్తిలో ఉన్నవారి పట్ల మాత్రం పూర్తి ఎంపతీ కనపడుతుంది రచయితలో. అంతవరకూ సంతోషిన్చాల్సిందే.

వీటికి మించి అప్పటి రాజకీయ వాతావరణపు చిత్రణ మాత్రం అత్యంత నిజాయితీగా సాధ్యమైనంత వివరంగా ఇచ్చారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రాజకీయాల మీద సమగ్రమైన వ్యాఖ్యానం, అంతర్జాతీయ వ్యవహారాలపైన విహంగ వీక్షణం ఇచ్చారు. డెబ్బైలని దాదాపుగా ఒడిసిపట్టారు. ఘనం శీనయ్య జావళీల నుంచి, చారుమతి వీణ, అనంత్ గిటార్ల సాక్షిగా నికోలాయ్ రోరిక్ గంగావతరణం పెయింటింగ్ దాకా ఇందులో లేనిది లేదు. నిస్సందేహంగా అనితరసాధ్యమైన రచన, మీకు ఆభిరుచి వుంటే కొంచెం కష్టపడైనా తప్పక చదవండి. విమర్శలు చూసి ఆగకుండా మీకు మీరుగా తేల్చుకోండి. ఇది అసమగ్రమే, కానీ ప్లాట్ఫారం పరిధికి మించి రాసాను కాబట్టి ఇక్కడితో ఆపుతునాను.
Profile Image for Aruna Kumar Gadepalli.
2,876 reviews117 followers
August 12, 2020
1970-81 ఓ దశాబ్దం వరకు భారతదేశంలో జరిగిన పరిణమాలు వాటి ప్రభావం విద్యార్థుల మీద, ప్రత్యేకించి ఉన్నత విద్య వర్గంలో వారి మీద వారి జీవన విధానం మొదలగు వాటి గురించి ప్రత్యేకంగా ఉస్మానియ విశ్వవిద్యాలయం అక్కడి వాతావరణం అనేక కోణాలలో వివరించిన నవల.
Displaying 1 - 2 of 2 reviews

Can't find what you're looking for?

Get help and learn more about the design.