The Book : Life of Akkineni Nageswara Rao Itself A Treatise on Personality Development
ఇంటింటా టీవీ చానళ్ళు విస్తరిస్తున్నా ఇప్పటికీ మనకు ఏకైక వినోద సాధనం సినిమాయే. టీవీలకూ ప్రధాన వనరు సినిమా ఆధారిత కార్యక్రమాలే. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు సినిమాలు చూస్తూ మూడు నాలుగు తరాలు పెరిగాయి. వీరు పోషించిన వందలాది పాత్రల ప్రభావం ప్రతి ఒక్కరి మీదా ఎంతో కొంత ఉంటూనే వచ్చింది.
ఇంతకాలం ప్రతి ఒక్క తెలుగు వాడి జీవితంలో అవిభాజ్యంగా ముడిపడి, ఎన్నెన్నో అందమైన అనుభూతులను, మధురమైన జ్ఞాపకాలను మిగిల్చిన ఈ చిత్రసీమలో ప్రధాన భూమిక పోషించారు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన జీవన గమనాన్ని, జీవితాన్ని, ఆయన మలుచుకున్న విధానాన్ని ప్రతి వారూ పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన తన జీవితానుభావాల నుంచి సామాన్య ప్రజలకు, నటులకు, నిర్మాతలకు, రచయితలకు, దర్శకులకు జీవితంలో పనికి వచ్చే ఎన్నో సూచనలు చేశారు. వచ్చే తరాల వారికి కూడా ఆయన ఇచ్చిన సలహాలు జీవితంలో ముందుకు పోవడానికి తోడ్పడతాయి. తెలుగు వారందరి తరపున ఆయన రుణం కొంతయినా తీర్చుకోవటానికి ఈ పుస్తకం ద్వారా అవకాశం లభించినందుకు ఎంతో ఆనందిస్తున్నాం. మా సంస్థ విలువలను మరింత పెంచే ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలకు సగర్వంగా సమర్పిస్తున్నాను. అక్కినేని నాగేశ్వరరావు జీవితాన్ని నటనాపరంగానే కాక వ్యక్తిత్వ వికాస కోణంలో సమగ్రంగా ఆవిష్కరించడానికి చేసిన ఈ ప్రయత్నాన్ని తెలుగు వారు, అక్కినేని అభిమానులు సమాదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.