• పుస్తకం పేరు: నిశ్శబ్ద విస్ఫోటనం
• రచయిత: యండమూరి వీరేంద్రనాథ్
కథాంశం: పల్లెటూరిలో పాఠాలు చెప్పుకునే ఒక ఉపాధ్యాయుడు. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితుల్లో చిన్నప్పటినుంచి తన కనుసైగల్లో పెరిగిన తన కూతురు ఆ శిక్ష నుండి ఆయనను ఎలా తప్పిస్తుందనేది కథ.
మన జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులే మనలో ఉన్న మరొకరిని బయటకు చూపిస్తాయి. అప్పటివరకు మనకు కూడా తెలియదు మనలో ఉన్న మరొకరి సంగతి.
కథలో కూడా పల్లెటూరి యువతి తన తండ్రిని శిక్ష నుంచి తప్పించడానికి తనలో ఉన్న మరొకరిని బయటకు తీసి రాజకీయ నాయకులను, మాఫియా రౌడీలను ఎవరు అడ్డొస్తే వాళ్లందర్నీ కూడా తన జ్ఞానంతో మరియు వ్యూహాలతో ఎదిరించి, పోరాడి వారిని మట్టికరిపించి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుతుంది.
ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా, ఎంత పెద్ద సమస్య మన జీవితంలో ఎదురైనా భయపడకుండా మన సాయ శక్తుల్ని ఉపయోగించి దానిని ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగాలని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.
నవల చదువుతున్నప్పుడు చదివిన తర్వాత ప్రధాన పాత్ర పోషించిన ఆ యువతికి అభిమానులుగా మారిపోతాం. మనకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో ఆమె లాగా ఆలోచించాలని నిర్ణయించుకుంటాం
కథ చదువుతున్నంతసేపు చాలా ఆసక్తిగా నడుస్తుంది. ప్రతి పాత్ర నుండి జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. కథలో వచ్చే మలుపులు మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి.
ప్రతి అధ్యాయం ముగింపులో తరువాత ఏం జరుగుతుందనే కుతూహలం కలుగుతుంది.
యండమూరి వీరేంద్రనాథ్ గారి యొక్క రచనా శైలి ఎప్పటిలాగే అద్భుతం. సస్పెన్స్, రొమాన్స్, ట్విస్టులు అన్నీ ఉంటాయి. భాష సరళంగా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది.
యండమూరి వీరేంద్రనాథ్ గారి కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం ఈ నిశ్శబ్ద విస్ఫోటనం.
- నడిగట్ల ప్రేమ్ కుమార్
For detailed reviews & book recommendations, follow us on Instagram 👉 @pustakalaprapancham