నల్లమిల్లోరిపాలెం కథలు దర్శకుడిగానే కాదు రచయతగా కూడా వంశీ కి అభిమానులు ఎక్కువే. అందుక్కారణం ఆయన రచనా శైలి. సాధారణంగా ఒక కథని ఎంత ఆహ్లాదకరంగా చెప్పాము అని కాకుండా ఆ కథని చదువుతున్న పాఠకుడు ఆ కథలో ఎంత లీనమైపోయాడు అనేది ముఖ్యం. అలా మనల్ని లీనం చేస్తూ, సహజత్వానికి దగ్గరగా ఉండేలా రచనలు చేయగల నైపుణ్యం కలవాడు వంశీ. గోదావరి జీవన విధానాన్ని ఎంతో చక్కగా తన రచనల ద్వారా ఆవిష్కరించే వంశీ ఈసారి ఈ ‘‘నల్లమిల్లోరిపాలెం కథలు’’ సంకలనంలో వున్న 42 కథలుతో తనలోని వివిధ పార్శ్వాలని పాఠకులకి పరిచయం చేశారు. గుండెల్ని గట్టిగా హత్తుకొనే కథలతో పాటు, ఆలోచింపజేసే కథలతో పాటు కొన్ని నిజ జీవితపు కథలున్నాయి ఈ ‘‘నల్లమిల్లోరిపాలెం కథలు’’.