విరించి దివంగమనం
ఫిబ్రవరి 2, 2023 కే విశ్వనాథ్ గారు దివంగతులయ్యారు. మరుసటి రోజు పూణే లో ఉన్న నేను బస్సు లో కొంత దూరం ప్రయాణించి కృష్ణ నది ఒడ్డున, ఆయన ఎన్నో మరపురాని చిత్రాలకు దృశ్యాలకు దోహదంగా వాడిన అదే నీటిని చూస్తూ, తాకుతూ ఆయన గురించి ఆయన కళాత్మ గురించి ఈ వ్యాసం రాసాను.

“కళ అనేది అవస్థను ప్రతిబింబించే అద్దం కాదు, సమాజాన్ని తీర్చిదిద్దే సుత్తి” అని అన్నారు మహానాటక కర్త విమర్శకుడు బెర్టోల్ట్ బ్రెక్ట్. కానీ ఆ అద్దం, ఈ సుత్తి మధ్యన అది శతకోటి అవతారాలు దాలుస్తుంది. నిస్సహాయత, అలసట, అచాంచల్యం అను రుగ్మమతల నుండి దుఃఖం అన్న వ్యాధినుంచి మనసుకు ఉపశమనాన్ని అందించే ఔషధం. మత్సరముతో సంచరించే బాటసారికి వినయాన్ని నేర్పే మహావృక్షం. అదుపులేని శ్రద్ధా శ్రమలను విపరిత ఘృతముగా తాగి, ప్రజ్ఞ ఆలోచన అయిన కారుమబ్బులను వర్షింపజేసి, నాగరికత అన్న శశ్యశ్యామల ధాన్యాన్ని పండించే అతికఠోర కోమల యజ్ఞం. కళకున్న విశ్వరూపాన్ని ప్రకటించిన ఈ వైద్యడు, తోటమాలి, అగ్నిహోత, తపస్వి మన కళాతపస్వి, అంతేకాక ఆ సినిమా పీఠికలో ప్రకాశితమైనట్టు “నటరాజస్వామి పాదాలకు అర్పించే ‘స్వర్ణకమలం’ కళ”. విభిన్న మనుషులు, వేర్వేరు సంప్రదాయాలు, ఏకంగా చరిత్రల శృంగారంగా కలిసి ముద్దులాడుకునే ‘సాగరసంగమం’ కళ. గర్వం, అనాలోచన అన్న మసక చీకటిని ఖండించే అవిచ్ఛిన్న ‘స్వాతికిరణం’ కళ.
వాస్తవం, స్వభావోక్తి కూడా అతి, అతిశయోక్తి లా తలపింపచేస్తారు విశ్వనాధ్. ‘ఆకుచాటు పిందెతడిసె’ అన్న పాటకు చిందించిన వారికి, కేవలం కొన్ని నెలల గడువులో ఒక తంపుర పట్టుకొని నడుస్తున్న ఒక వటువు చేత ‘యే తీరుగ నను దయ చూచెదవో’ అని విరాగం నిండిన కృతి పాడిస్తూ అదే ప్రేక్షకులను ఆనందాల దిగంతాలకు తీసుకెళ్లిన మాంత్రికుడు విశ్వనాధ్.
భారతీయ రసశాస్త్రం కళకు, కళకున్న శక్తికి పెద్ద పీఠ వేసింది అనేది అందరూ చెప్పే మాటనే. అభినవగుప్తుడు రసాస్వాదన కు మూలం, శ్రోత తనను తాను మర్చిపోయి, తన ప్రస్తుత సందర్భాన్ని త్యజించి సకల మానవాళికి సమంగా ఉండే భావం భావనాశక్తితో ఏకమవ్వడం అని అన్నాడు; తథా పందితరాజ జగన్నాథుడు ఆ రసానుభూతి, చమత్కారం అద్వైత స్థితికి దగ్గరగా ఉంటుంది అని అన్నాడు. అనగా రసంతో ఏకంకావడం పరమాత్మతో ఏకం కావడమే. ఈ సందేశాన్ని విశ్వనాధ్ నిరంతరం తన చిత్రాలలో పాటలలో శ్లాఘించారు, తన రచయితల చేత రాయించారు, గాయకుల చేత పాడించారు, నటులచేత అభినయింపచేసారు. “సమనిగమాజసుదామయ” అని సంగీతము పురుషభూతమైతే శ్రీ కృష్ణుడు అని అంటున్న త్యాగరాజ కృతిని రెండు చిత్రాలలోకి తీసుకొనిరావడం కాకతాళీయం కాదు. ఏమాత్రం సంకోచం లేకుండా ‘అద్వైత సిద్ధి కి అమరత్వలబ్ధికి గానమే సోపానము’ అని వేటూరి చేత చెప్పించేసారు. కథానాయిక నృత్యం ఒక ప్రవృత్తిగా కాకుండా ఏకంగా ఆత్మపరివర్తన అని గుర్తుంచి నాట్యంచేసినప్పుడు చెప్పినట్టు “ప్రాణపంచము పంచాక్షరీ”, “తాండవమాడేవేళ తూహినగిరులు కరిగే” ను. తన సొంతపాటను విశ్లేషిస్తూ సిరివెన్నెల: కళాకారుడు కళలో నిమగ్నమవడం శివపార్వతుల లాస్యం – తాండవం ఏకం కావడానికి పోలిక అని తేల్చారు. ఇకపోతే ఆప్తులు దూరంకావడం, చనిపోవడం, ఓటమి ఎదురుకోవడం ఇలా జీవితం ఆడే జూదంలో కృంగిపోయే కథనంతో మరియు ‘నరుడి బ్రతుకు నటన ఈశ్వరుని తలుపు ఘటన’ అన్న పంక్తితో కైవల్యం, మాయావాదం మరియు పాశ్చాత్య తత్వం యొక్క ఎగ్సిస్తెన్షియలిజం యొక్క ఛాయలు తెలుస్తాయి. కానీ అంతటితో ఆగిపోకుండా, ఆలా స్వతహాగా అర్ధం లేని జీవితంలో నా కళ ద్వారా కథానాయకుని చేత అర్ధం వెతుక్కునేలా చేసి – అదే పాటలో అలాంటి పనిలేని పనికిమాలిన జీవితమే ‘సప్తగిరులు గా వెలిగే సుస్వరాల గోపురం’ అని అంటాడు. ఇంతకు మించిన తత్వమా, వేదాంతమా, కావ్యశాస్త్రమా, కళాకృతా?
నేను ఇదివరకే ప్రస్తావించినట్టు, ఆయన సిధ్ధాంతసారము యొక్క తియ్యదనాన్ని ఉదాత్తతకు ముఖ్యకారణం ఆయన ప్రసిద్ధప్రస్థాన సాహిత్యాన్ని గౌరవించడం. త్యాగరాజ స్వామి, రామదాసే కాకుండ, ఎన్నో అన్నమాచార్య కీర్తనలు, నారాయణ తీర్థ తరంగాలు, వసుదేవాచార్య కృతులు ఉపయుక్తం అయ్యాయి. ఇవి చాలవనట్టు, సీతారామశాస్త్రి రాసిన ‘కొలువై వున్నాడే’ పాటలో ఛత్రపతి శివాజీ మనవడు శాహాజి రాసిన ‘పల్లకి సేవాప్రబంధం’ లో నుంచి ‘పలుపొంకమగు’ చరణం వాడుకున్నారు. ఇంకా నాలాంటి చిన్నకారు సంస్కృతవిద్యార్థి కళాతపస్వి సినిమాలను చూసి పొందే ఆనందం అంత ఇంత కాదు! కమల్ హాసన్, జయప్రద డ్యూయెట్ ముందు కాళిదాసు రఘువంశమహాకావ్యం యొక్క మంగళాచరణ శ్లోకం పెట్టడం ఏంటి? ఋగ్వేదం యొక్క దుర్గాసూక్తం మంత్రపుష్పాలకు డాన్స్ సీక్వెన్స్ పెట్టడం ఏమిటి? అదే విధంగా తన కళ శక్తి తెలియని హీరోయిన్ కు మార్గం చూపడానికి గీతాశ్లోకం వాడటం. ఇదంతా ఒక వంతైతే ఈ సినీ కావ్యాల ఆత్మను ప్రదర్శించేలా భర్తృహరి సుభాషితం వాడటం “జయంతితే సుకృతినో ……. జరా మరణజం భయం”. (సుకర్మములు చేసిన వారికి, కళాదృష్టి కలవానికి , కవికి మృత్యుభీతం ఎన్నడూ ఉండదు) అంతేకదా!
సంగీత, సాహిత్య, నృత్యాలు ఆయన కథా అంశాలు అని సాధారణంగా చెప్పబడినా, నిజానికి అవి ఆయన మాధ్యమాలు, భాషలు. ఆయన అంశాలు సాంఘికం. మనిషి మనసు, సంఘం లో ఉన్న సమస్యలు ఆ రెంటి మధ్య ఉన్న సంబంధానికి అద్దం పడుతాయి. ఆయన అందువల్ల ఒక సామజిక, మానసిక శాస్త్రవేత్త. కానీ ఆ రెండు ఉద్యోగాల కింద అధిష్ఠానంగా ఒక భావం నిలిచి ఉంది: మనిషి మంచి వాడు. ఈ మానవవాదానికి అత్యున్నత నిదర్శనాలు స్వాతిముత్యం, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు. ఈ మూడింటి లోను కథానాయకులు సమాజపు సంకుచితాలు అంటని వ్యక్తులు. ఒకరు తన అమ్మమ్మ ఏదో అయోమయం లో అన్న ఒక మాట విని తెలిసి తెలియని తెలివి తో ఒక విధవను కట్టుకుంటే, ఇంకొకరు ఇష్టపడిన వ్యక్తి కోసం మెంటల్ హాస్పిటల్ లో చేరుతాడు. వారికి అబద్ధం ఆడటం రాదు, కానీ మిగితావారందిరికి సమాజం అబద్ధం ఆడటం నేర్పింది. వారికి సందర్పరహితంగా ఉండటం మాత్రం తెలుసు, కానీ సమాజం లౌక్యం నేర్పింది. మతం తెలియదు; సమాజం ధర్మం పేరుతో విషాన్ని పంచుతున్నది. కనుక దీని అర్ధం ఒకటే అయ్యి ఉండవచ్చు. సమాజాన్ని పూర్వం మనిషి లో ఉన్న ప్రకృతిలో ఏదో అందం, శుద్ధత, మంచితనం ఉంది ఉండాలి. ఈ సత్యాన్ని తెలుసుకున్నది మన సిరివెన్నెల. గుడ్డివాడైనా ఈ వేణు లోలుడు తాను అభిమానించిన వ్యక్తి వెనుక ఉన్న గతాన్ని చూడడు, శీలం అని కనిపెట్టిన ఒక పదార్ధాన్ని గ్రహించడు. మనిషిని మనిషిలా మాత్రమే చూస్తాడు. ఇంతకు మించిన భావజాలం ఏముంది?
కానీ ఈ సమాజాన్ని మార్చడానికి ఈ మానవవాదం చాలా? బహుశా కాదేమో. అందుకు ఆయన సంస్కర్తగా మారుతాడు. “సంప్రదాయం ఉండేది మనిషిని సక్రమమైన మార్గం లో నడిపించడానికే కానీ మనిషిని మనిషిని వేరు చేయడానికి కాదు” అని అంటాడు. జీవితకాలం, తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని, తనమీద కక్షకట్టినా, మనుమరాలిని, తన మనసుని తెలుసుకొని బ్రాహ్మణికాన్ని వ్యతిరేకించి, ఆయనే చేసిన పెళ్లిని కూడా కాదని, ఒక దళితునికిస్తాడు. అవసరమైతే ప్రపంచాన్ని ఇంత ద్వేషం తో, వివక్ష తో నిలిపినందుకు ఈశ్వరుణ్నే దూషిస్తాడు ( కానీ మరోచోట తానే నిందాస్తుతి మాత్రమే అని నిర్ధారిస్తాడు). భూస్వామ్య వ్యవస్థ అరాచకం చేయిజారిపోయినప్పుడు, మానవత్వాన్ని గౌరవించనప్పుడు దానిపై తానే యుద్ధం ప్రకటించి సహాయనిరాకరణమే మార్గమని చాటుతాడు.
మనం కాశీనాథుని విశ్వనాధ్ చిత్రాలను చూసేకొద్దీ, ఆయన చిత్రాలే ఆయన స్వీయచరిత్రలు అని తెలుస్తుంది. భర్తృహరి చెప్పిన ‘సుకృతుడు’ , ‘కవీశ్వరుడు’ ఆయన కాదా? ‘విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం’ అనేది తన పయనం గురించి కాదా? ” సంగీత సాహిత్య సమలంకృతుడు, స్వరరాగా పదయోగ సమభూషితుడు” ఈ జీవిన వాగ్గేయకారుడే కదా. ఆఖరికి ఆ స్వీయచరిత్ర ముగింపు కుడా ఆయనే చిత్రాలలో రాసేసినట్టు అనిపిస్తుంది. వయసు, కాలమనే తెలిమంచు కరిగిందని, తలుపు తీయమని ప్రభువును కోరినాడు. నటరాజ పాదాన తలదాల్చినాడు.


